Priyaanka Gandhi: వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయలేదంటే..: ప్రియాంకా గాంధీ

  • కాంగ్రెస్ నాయకత్వం పోటీ వద్దని భావించింది
  • ఎంతో మంది తరఫున ప్రచారం చేయాల్సివుంది
  • వారిని నిరాశకు గురిచేయరాదనే పోటీకి దూరం
  • కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక

తాను వారణాసి నుంచి పోటీ చేయరాదన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకత్వమే తీసుకుందని, అందరూ కలిసి చర్చించి ఈ నిర్ణయానికి వచ్చారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేస్తుండటంతో, ఈ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకంగా మారగా, ప్రియాంకను పోటీకి దింపనున్నారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై ఆమె పోటీకి దిగలేదు.

తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రియాంక, తనపై చాలా పెద్ద బాధ్యతలను పార్టీ ఉంచిందని, ఎంతో మంది తరఫున తాను ప్రచారం చేయాలని కోరుకుంటున్నారని, ఈ దశలో తాను పోటీ చేస్తే, వారు నిరాశకు గురవుతారని అభిప్రాయపడ్డారు. అందుకే తాను పోటీ చేయబోవడం లేదని అన్నారు.

తనకుగానీ, తన సోదరుడు రాహుల్ గాంధీకిగానీ, పదవులపై ఆశ లేదని, ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీయే ప్రధాని అవుతారని తను అనలేదని స్పష్టం చేశారు. దేశంలో ఎన్నో తీవ్రమైన సమస్యలుంటే, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం మామిడిపళ్లు ఎలా తినాలన్న విషయాన్ని మాట్లాడుతుండటం విచారకరమని, నటుడు అక్షయ్ కుమార్ తో జరిగిన ముఖాముఖిని ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు.

ఈ ఇంటర్వ్యూలోని కొంత భాగాన్ని తాను చూశానని, మహిళల భద్రత, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం తదితర సమస్యలన్నీ పక్కనబెట్టిన ఆయన పళ్లు ఎలా తినాలన్న విషయాన్ని చర్చించారని మండిపడ్డారు. ప్రధాని హోదాలో ప్రపంచమంతా పర్యటించి వచ్చిన ఆయన, వారణాసిలోని ఒక్క గ్రామాన్ని కూడా ఇంతవరకూ సందర్శించలేదని ప్రియాంకా గాంధీ మండిపడ్డారు.

More Telugu News