lakshmis NTR: ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ కోసం రోడ్డెక్కుతున్న దర్శకుడు రాంగోపాల్‌ వర్మ

  • నేడు నడిరోడ్డుపై ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నట్లు ట్వీట్‌
  • ప్రెస్‌మీట్‌కు వేదిక లేదంటూ ‘కుట్రల మీద కుట్రలు‘ పోస్టర్‌ విడుదల
  • పైపుల రోడ్డు ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గర మీడియా సమావేశమని వెల్లడి

ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో మీడియాలో హడావుడి చేసే దర్శకుడు రాంగోపాలవర్మ తాజాగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం ఏపీలో విడుదల ముందు అటువంటి హడావుడే సృష్టిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన అనంతర జీవిత కథనాన్ని ’లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌‘గా వర్మ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేసేందుకు వర్మ చేసిన ప్రయత్నాలకు ఎన్నికల సంఘం బ్రేక్‌ వేసింది.

ఎన్నికల వేళ ఈ చిత్రం రిలీజ్‌ చేయవద్దంటూ కొందరు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడంతో వర్మ వ్యూహం ఫలించలేదు. ఏపీలో తప్ప మిగిలిన అన్నిచోట్ల మార్చి 29న విడుదలై విజయం సాధించిన ఈ చిత్రం ఏపీలో విడుదలకు మాత్రం పలు అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు మే 1న ముహూర్తం ఫిక్స్‌ కాగా, ప్రమోషన్‌ కోసం ఈరోజు వర్మ విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో ప్రెస్‌మీట్‌ ఉందంటూ మీడియా ప్రతినిధులకు ఆహ్వానం పంపారు.

ఈలోగా ఏమైందో అర్ధరాత్రి అయ్యేసరికి ‘మీకు తెలిసిన వ్యక్తి బెదిరింపుల కారణంగా నోవాటెల్‌ యాజమాన్యం ప్రెస్‌మీట్‌కు అంగీకరించ లేదు. మిగిలిన హోటల్స్‌, క్లబ్బుల యాజమాన్యాలను సంప్రదించినా వారు కూడా సదరు వ్యక్తి హెచ్చరిక గురించే చెప్పారు. ఇక గత్యంతరం లేక విజయవాడ పైపుల రోడ్డులోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గర నడిరోడ్డుపై ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రెస్‌మీట్‌ నిర్వహించాలని నిర్ణయించాను’ అంటూ అర్ధరాత్రి ట్వీట్‌ చేస్తూ ‘కుట్రల వెనుక కుట్రలు’ అనే పోస్టర్‌ను జత చేశారు.

ఎన్టీఆర్‌ మరణానికి అసలు కారణం అంటూ ఎన్టీఆర్‌, చంద్రబాబు ఫొటోలను విడుదల చేశారు. ఉదయానికి ఈ వార్త మీడియాలో హల్‌చల్‌ చేస్తుండడంతో ప్రస్తుతం ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఏదో ఒక వివాదం సృష్టించడం ద్వారా సినిమాని ప్రమోట్‌ చేయడం వర్మ స్టైల్‌ అని, నెల రోజుల క్రితం అన్ని చోట్లా విడుదలైన సినిమాను ఏపీలోను బాగా ఆడించేందుకు వర్మ ఈ మార్గాన్ని ఎన్నుకున్నారని అంటున్నవారూ వున్నారు.

 కాగా, వర్మ ప్రకటించినట్టు నడిరోడ్డుపై ప్రెస్‌మీట్‌ పెడితే, అదీ ఏపీలో కాబట్టి ఆయన అరెస్ట్‌ ఖాయమని, అదే జరిగితే ఈ వివాదం మరింత ముదురుతుందని పరిశీలకులు అంటున్నారు.

More Telugu News