Rohit Shekhar: నన్ను చంపేస్తారేమో.. జైలులో ప్రత్యేక గది ఇవ్వండి: కోర్టుకు మొరపెట్టుకున్న రోహిత్ తివారీ భార్య అపూర్వ

  • జైలులో తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన
  • చదువుకున్న మహిళా ఖైదీలు ఉన్న చోట తనను ఉంచాలని అభ్యర్థన
  • తాము జోక్యం చేసుకోలేమన్న కోర్టు

రోహిత్ శేఖర్ తివారీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భార్య అపూర్వ శుక్లా జైలులో తనకు ప్రత్యేక గది కేటాయించేలా అధికారులను ఆదేశించాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. జైలులో ఇతర ఖైదీలతో కలిసి ఉండడం వల్ల తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ప్రత్యేకంగా ఓ సెల్ కేటాయించాలని కోరింది. అయితే, ఆమె అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని తేల్చి చెప్పింది. అవన్నీ జైలు నిబంధనల ప్రకారం జరుగుతాయని, తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

 రోహిత్‌ను తానే హత్య చేశానని అంగీకరించిన అపూర్వను ఈ నెల 26న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపూర్వకు ఢిల్లీ కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. ఈ సందర్భంగా శుక్లా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. జైలులో అపూర్వ ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో చదువుకున్న మహిళా ఖైదీలు ఉన్న సెల్‌లో ఆమెను ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, ఈ అభ్యర్థనను కొట్టివేసిన కోర్టు పై విధంగా స్పందించింది.

More Telugu News