ఆర్సీబీయా? కేకేఆరా? నేటితో తేలిపోతుంది!

28-04-2019 Sun 08:58
  • నేటి రాత్రి 8 గంటలకు మ్యాచ్
  • రెండు జట్లకూ 8 పాయింట్లు
  • గెలిస్తేనే ప్లే ఆఫ్ చాన్స్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్... ఈ రెండు జట్లలో ఎవరు నిలుస్తారో, ఎవరు ప్లేఆఫ్ కు చేరకుండా నిష్క్రమిస్తారో నేటితో తేలిపోతుంది. రెండు జట్లూ చెరో 11 మ్యాచ్ లు ఆడి, నాలుగు విజయాలతో ఎనిమిదేసి పాయింట్లతో ఉన్నాయి. నేటి రాత్రి ఈ రెండు జట్ల మధ్యా కీలక పోరు సాగనుంది. ఇందులో గెలిచే జట్టు మాత్రమే 10 పాయింట్లు సాధించి ముందడుగు వేస్తుంది. ఓడిపోయే జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఉండవు.

ఇక ప్రతి జట్టూ 14 మ్యాచ్ లను ఆడుతుందన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తో ఆర్సీబీ, కేకేఆర్ లకు 12 మ్యాచ్ లు ముగుస్తాయి. ఓడిన జట్టు ఆపై ఆడే మిగతా రెండు మ్యాచ్ లను గెలిచినా 12 పాయింట్లకు మాత్రమే చేరుతుంది. 12 పాయింట్లు సాధించే జట్టుకు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు ఉండవు. కనీసం 14 పాయింట్లు సాధిస్తే, మిగతా జట్ల ప్రదర్శనపై ఆధారపడి, జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఐపీఎల్ చరిత్రలో 14 పాయింట్లతో ప్లే ఆఫ్ కు ఓ జట్టు వెళ్లిన సందర్భాలు మూడు మాత్రమే.

ఇప్పటివరకూ చెన్నై మాత్రమే ఈ సీజన్ లో ప్లే ఆఫ్ ను ఖరారు చేసుకోగా, మిగతా మూడు స్థానాల కోసం ముంబై, ఢిల్లీలు 14 పాయింట్లతో, హైదరాబాద్, పంజాబ్, రాజస్థాన్ లు 10 పాయింట్లతో పోటీలో ఉన్నాయి. ఈ ఐదు జట్లకూ ప్లే ఆఫ్ అవకాశాలు ఉండగా, వీటి ఆటతీరు, గెలుపోటములపై నేడు ఆర్సీబీ, కేకేఆర్ ల మధ్య గెలిచే జట్టుకు చాన్స్ ఉంటుంది. దీంతో ఈ పోరును రెండు జట్లూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయనడంలో సందేహం లేదు.