Sravani: వద్దని చెప్పినా సమ్మర్ క్లాసులు పెట్టిన పాఠశాల... అదే శ్రావణి హత్యాచారానికి కారణమంటున్న పోలీసులు!

  • నాలుగు రోజుల క్రితమే హత్య
  • సమ్మర్ క్లాసుకు వెళ్లి తిరిగిరాని శ్రావణి
  • ఫిర్యాదు చేసినా స్పందించని ఎస్ఐపై చర్యలు

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో జరిగిన 9వ తరగతి బాలిక శ్రావణి హత్య కేసులో నిందితుల వేటలో ఉన్న పోలీసులు, ఆమె చదువుతున్న సెరినిటీ మోడల్ స్కూల్ పైనా కేసు పెట్టారు. ఈ వేసవిలో ప్రభుత్వం సెలవులు ప్రకటించిన తరువాత కూడా, 10వ తరగతిలోకి ప్రవేశించనున్న వారి కోసం స్కూల్, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండటం, ఆ క్లాసెస్ కు వెళ్లిన శ్రావణి, దారుణంగా అత్యాచారం, హత్యకు గురి కావడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు.

హాజీపూర్ సమీపంలోని పాడుబడిన బావిలో శ్రావణి మృతదేహం లభ్యం కావడం, హత్య జరిగి నాలుగు రోజులు అయ్యుంటుందని పోలీసులు నిర్ధారించడంతో కేసు మరింత జటిలమైంది. తమ బిడ్డ కనిపించడం లేదని నాలుగు రోజుల క్రితమే శ్రావణి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదన్న కారణంతో బొమ్మల రామారం ఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఎస్ఐని హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇక శ్రావణిని ఎవరు హత్య చేసుంటారన్న కోణంలో విచారణ సాగుతుండగా, బాగా తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడివుంటారన్న అనుమానాలు నెలకొనివున్నాయి. సమ్మర్ క్లాసులు పెట్టవద్దని పాఠశాలల యాజమాన్యాలకు చెప్పినా, వారు మార్కుల కోసం ఇలా క్లాసులు పెట్టడం కూడా ఈ ఘటనకు కారణమని పోలీసు వర్గాలు అంటున్నాయి. సెరినిటీ స్కూల్ పై చర్యలకు విద్యాశాఖకు సిఫార్సు చేసినట్టు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. 

More Telugu News