Andhra Pradesh: అప్పు చెల్లించినా ఇంటి పత్రాలు ఇవ్వని శ్రీరామ్ చిట్స్ సంస్థ.. ఆఫీసుకు తాళం వేసిన బాధితుడు!

  • అనంతపురం జిల్లాలోని కదిరిలో ఘటన
  • అప్పు కోసం ఇంటిపత్రాలు తనఖా పెట్టిన శంకరాచారి
  • అసలు-వడ్డీ చెల్లించినా పత్రాలు వెనక్కి ఇవ్వని వైనం

తీసుకున్న అప్పు పూర్తిగా చెల్లించినా ఓ సంస్థ తనఖా పెట్టిన ఇంటి పత్రాలను ఇవ్వలేదు. దీంతో తిక్కరేగిన సదరు వ్యక్తి ఏకంగా ఆ సంస్థ కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగాడు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని కదిరికి చెందిన శంకరాచారి డబ్బు అవసరమై ఇంటి పత్రాలను ఇక్కడి శ్రీరామ్ చిట్స్, లోన్స్ సంస్థలో తాకట్టు పెట్టాడు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం అప్పు-వడ్డీ మొత్తాన్ని చెల్లించేశాడు. అయితే శ్రీరామ్ చిట్స్ కంపెనీ మాత్రం ఇంటి పత్రాలను ఇవ్వలేదు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఈరోజు ఉదయం శ్రీరామ్ చిట్స్ ఆఫీసుకు తాళం వేసి నిరసనకు దిగాడు.

ఈ సందర్భంగా శంకరాచారి బంధువులకు, శ్రీరామ్ చిట్స్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా, తన ఇంటిని మరొకరికి అమ్ముతున్నామనీ, రిజిస్ట్రేషన్ కోసం ఒరిజినల్ పత్రాలు ఇవ్వాలని 6 నెలలుగా తిరుగుతున్నా ఫలితం లేకపోయిందని బాధితుడు శంకరాచారి ఆవేదన వ్యక్తం చేశాడు. ఆందోళన నేపథ్యంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఇరువర్గాలను శాంతింపజేశారు.

More Telugu News