Air India: ఈ ఉదయం నుంచి ఎయిరిండియా సర్వర్ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన విమాన రాకపోకలు

  • ఈ తెల్లవారుజామున 3:30 గంటల నుంచి నిలిచిపోయిన సర్వర్
  • విమానాశ్రయాల్లో ప్రయాణికుల పడిగాపులు
  • సమస్య పరిష్కారం కోసం రంగంలోకి సాంకేతిక నిపుణులు

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన ‘సిటా’ సర్వర్ ఈ ఉదయం 3:30 గంటల నుంచి పనిచేయడం మానేసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎయిరిండియా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో విమానాలు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు వెళ్తాయో తెలియక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిరిండియా ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు.

 ఇక, ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో అయితే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ఎయిరిండియాపై దుమ్మెత్తి పోస్తున్నారు. కొన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

దీంతో స్పందించిన ఎయిరిండియా తమ సాంకేతిక సిబ్బంది సమస్యను పరిష్కరించే పనిలో వున్నారని, ప్రయాణికులు తమకు సహకరించాలని కోరింది. మెయిన్ సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని వివరించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు పేర్కొంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

More Telugu News