KCR: వరంగల్ మేయర్ ఎంపికపై కొనసాగుతున్న అభిప్రాయ సేకరణ

  • కార్పొరేటర్లతో సమావేశమైన టీఆర్ఎస్ నేతలు
  • రింగ్ రోడ్ కల త్వరలోనే నెరవేరుతుంది
  • ఎన్ని కోట్లైనా వెచ్చించేందుకు కేసీఆర్ సిద్ధం

వరంగల్ మేయర్ ఎంపికపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. నేడు నగరంలోని సునీల్ గార్డెన్స్‌లో టీఆర్ఎస్ కీలక నేతలు, ఆ పార్టీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ, వరంగల్ నగర అభివృద్ధి కోసం ఎన్ని కోట్లైనా వెచ్చించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రింగ్ రోడ్ కల కూడా త్వరలోనే నెరవేరుతుందన్నారు. మేయర్ ఎంపికలో కార్పొరేటర్ల అభిప్రాయం ముఖ్యమనే కేసీఆర్ భావిస్తున్నారని, అందుకే ఇన్‌చార్జిగా బాలమల్లును వరంగల్‌కు పంపారని దయాకర్‌రావు తెలిపారు.

మండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కార్పొరేటర్లంతా నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు వెల్లడించవచ్చని, అందరి ఏకాభిప్రాయం మేరకే మేయర్ పేరు ఖరారవుతుందన్నారు. అయితే తూర్పు నియోజకవర్గంలో మెజారిటీ కార్పొరేటర్లు ఉన్నందున మేయర్ పదవి తమకే కేటాయించాలని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కోరారు. తమ నియోజకవర్గ కార్పొరేటర్ల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. మొత్తంగా అందరూ పార్టీ అధినేత ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. మొత్తానికి ఈ రోజు మాత్రం మేయర్ ఎంపికను పూర్తి చేస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News