Brazil: "మామా... పోలీస్!" అంటూ అరిచి స్మగ్లర్లను అప్రమత్తం చేసిన రామచిలుక... అరెస్ట్ చేసిన పోలీసులు

  • బ్రెజిల్ లో విస్మయకర ఘటన
  • చిలుక అరుపుతో పరారైన కొకైన్ స్మగ్లర్లు
  • అక్కడే ఉన్న చిలుకను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మనిషికి బాగా మచ్చికయ్యే పక్షుల్లో రామచిలుక కూడా ఒకటి. మనుషులు మాట్లాడే కొన్ని పదాలను పలకగలిగే సామర్థ్యం చిలుకల సొంతం. బ్రెజిల్ లోని ఓ రామచిలుక కూడా అలాంటిదే. అయితే ఇది తన టాకింగ్ పవర్ తో ఓ మాఫియా ముఠా పారిపోయేందుకు సహకరించడం ఆసక్తి కలిగిస్తోంది.

పియావి రాష్ట్ర ముఖ్యపట్టణం విలా ఇర్మా డుల్సేలో కొకైన్ స్మగ్లింగ్ తీవ్రరూపం దాల్చడంతో అక్కడి పోలీసులకు కంటిమీద కునుకు కరువైంది. మాఫియా ముఠాలను పట్టుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో ఇంటిపై దాడికి దిగారు. ఆ ఇంట్లో భారీ మొత్తంలో కొకైన్ నిల్వచేశారన్న సమాచారంతో పోలీసు బలగాలు చుట్టుముట్టాయి.

అయితే, ఆ ఇంటి గుమ్మం వద్ద ఉన్న ఓ రామచిలుక వెంటనే "మామా... పోలీస్!" అంటూ అదేపనిగా అరవడం ప్రారంభించింది. చిలుక అరుపులు విన్న స్మగ్లర్లు మరో ద్వారం నుంచి పరారయ్యారు. లోపలికి వెళ్లిన పోలీసులకు ఒక్కరు కూడా కనిపించలేదు. ఇదంతా చిలుక చేసిన నిర్వాకమేనని గ్రహించిన పోలీసులు మరేమీ ఆలోచించకుండా ఆ చిలుకను అరెస్ట్ చేశారు.

క్రిమినల్స్ కు సాయపడడం కూడా నేరమేనని, ఆ విధంగా చిలుక చేసింది కూడా క్రైమ్ కిందకు వస్తుందని భావించారు. ఇన్వెస్టిగేషన్ సందర్భంగా పోలీసులు ఆ చిలుకతో ఒక్క మాట కూడా మాట్లాడించలేకపోయారట. మరోవైపు పక్షి ప్రేమికుల ఒత్తిళ్లు కూడా ఎక్కువవడంతో చేసేదిలేక దాన్ని స్థానికంగా జూ అధికారులకు అప్పగించారు.

More Telugu News