inter board: స.హ.చట్టం మేరకు ఇంటర్‌ జవాబుపత్రాలు ఇవ్వలేం: తెలంగాణ ఇంటర్‌ బోర్డు స్పష్టీకరణ

  • తీసుకోవచ్చని సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో వార్తలు
  • దీనిపై వివరణ ఇచ్చిన బోర్డు కార్యదర్శి అశోక్
  • రుసుము చెల్లించి మాత్రమే తీసుకోవాలి

ఇంటర్‌ జవాబు పత్రాలకు సమాచార హక్కు చట్టం వర్తించదని, నిర్దేశిత ఫీజు చెల్లించి సదరు విద్యార్థులు మాత్రమే తీసుకునే అవకాశం ఉందని తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా జవాబు పత్రాలు తీసుకోవచ్చని, విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చునని సామాజిక మాధ్యమాలు, కొన్ని పత్రికల్లో వార్తలు రావడంపై కార్యదర్శి స్పందించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005 అక్టోబరు 13న జారీ చేసిన 454 జీవో ప్రకారం మూల్యాంకనం చేసిన ఇంటర్‌ జవాబు పత్రాలు ఫీజు చెల్లించి తీసుకునే సామగ్రి కిందకు వస్తాయని తెలిపారు. అందువల్ల సంబంధిత విద్యార్థులు మాత్రమే బోర్డు నిర్దేశించిన ఫీజు చెల్లించి జవాబు పత్రాలు పొందే అవకాశం ఉందని, ఇతరులకు లేదన్నారు.

అలాగే ఇంటర్‌లో తప్పిన విద్యార్థుల జవాబు పత్రాలను ఉచితంగా రీవాల్యుయేషన్‌ చేస్తామని, అందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరం లేదని ఇంటర్‌ బోర్డు తెలిపింది. ఇప్పటికే ఫీజు చెల్లించి దరఖాస్తు చేస్తే ఆ ఫీజు వాపసు చేస్తామన్నారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు మాత్రం ఆయా కళాశాలల్లో చెల్లించాలని స్పష్టం చేశారు.

More Telugu News