KCR: సినిమా వాళ్లు కేసీఆర్‌కు భయపడడం లేదు.. ఇంటర్ ఫలితాలపై స్పందించిన నటుడు మంచు విష్ణు

  • కేసీఆర్ డిక్టేటర్ కాదు.. ఫైర్‌బ్రాండ్
  • ప్రభుత్వాన్ని నిందించొద్దు
  • తమ్ముళ్లు, చెల్లెళ్లు చనిపోవడం దురదృష్ణకరం

తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో జరిగిన అవకతవకల కారణంగా 20 మందికిపైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్న ఈ విషయంపై ప్రతిపక్షాలు ధర్నాలు వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి. పదుల సంఖ్యలో విద్యార్థులు రాలిపోతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఇంత జరుగుతున్నా విద్యార్థులకు అండగా ఏ ఒక్కరు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొంతమంది నటులు స్పందించి ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు తప్పితే అంతకుమించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. దీంతో కేసీఆర్‌కు సినిమా వాళ్లు భయపడుతున్నారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నటుడు మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా స్పందించాడు.  

ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్‌పై విష్ణు ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమా వాళ్లు కేసీఆర్‌కు భయపడుతున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేశాడు. మూల్యాంకనం తప్పిదాల వల్ల 20 మంది తమ్ముళ్లు, చెల్లెళ్లను కోల్పోవడం దురదృష్టకరమన్న విష్ణు.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దామని పేర్కొన్నాడు. ఇటువంటి హేయమైన చర్యపై ప్రభుత్వం స్పందించి ఉండకపోతే అప్పుడు నిజంగానే విమర్శలు వెల్లువెత్తేవని తాను భావిస్తున్నట్టు చెప్పాడు.  కేటీఆర్ చాలా చురుకైన నేత అని ప్రశంసించాడు. ఆయన పనిచేసే నాయకుడని తనకు తెలుసన్నాడు.

కేసీఆర్ డిక్టేటర్ కాదని, ఫైర్‌బ్రాండ్ అనేది అందరికీ తెలిసిన విషయమేనని పేర్కొన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని నిందించడం మాని దీని వెనక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవాలని విష్ణు కోరాడు.  కేసీఆర్‌ను చూసి సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు భయపడుతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని విష్ణు స్పష్టం చేశాడు. తప్పిదాల వెనక ఉన్న కారణాలను తెలుసుకుంటే భవిష్యత్తులో మరిన్ని తప్పిదాలు జరగకుండా అడ్డుకోవచ్చని విష్ణు తన ట్వీట్లలో పేర్కొన్నాడు.

More Telugu News