Chandrababu: చంద్రబాబు అధికారాలు లేని ముఖ్యమంత్రి: సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు

  • సాంకేతికంగా చంద్రబాబు ముఖ్యమంత్రే
  • నెగ్గితే జగన్ మంచి ముహూర్తం చూసుకుని సీఎం అవుతారు
  • టీడీపీ నేతలది అవగాహనా రాహిత్యం

వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లోకి ఎక్కిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తన ఇష్టం వచ్చినట్టు సమీక్షలు నిర్వహించడం కుదరదని, ఆయనకు రెగ్యులర్ సీఎంకు ఉన్న అధికారాలు ఉండవని అన్నారు. సాంకేతికంగా చూస్తే ఆయన ముఖ్యమంత్రేనని అయితే, అధికారాలు లేని సీఎం అని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలవకపోతే 23న దిగిపోతారని, మంచి ముహూర్తం చూసుకుని జగన్ సీఎం అవుతారని అన్నారు. సీఎం ఎవరైనా అధికార యంత్రాంగం వారికి సహకరిస్తుందని అన్నారు.  

అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఎన్నికల నియమావళికి లోబడి అధికార యంత్రాంగానికి సూచనలు ఇవ్వొచ్చని సీఎస్ పేర్కొన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై తాను నిర్వహించిన సమీక్షపై టీడీపీ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. నిధుల విడుదల విషయంలో ఏవైనా సందేహాలుంటే ఆర్థిక మంత్రి యనమల తనతో నేరుగా మాట్లాడవచ్చని సుబ్రహ్మణ్యం అన్నారు.

More Telugu News