Ganguly: ధోనీ, డీకే శాశ్వతం కాదు... టీమిండియా తర్వాతి వికెట్ కీపర్ ఎవరో చెప్పిన గంగూలీ

  • రిషభ్ పంతే టీమిండియా భావి వికెట్ కీపర్
  • మరో 15 ఏళ్లు ఆడతాడు
  • మున్ముందు మరెన్నో వరల్డ్ కప్ లు ఉన్నాయి

ఐసీసీ వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియాలో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు చోటు దక్కకపోవడంపై మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పందించారు. మహేంద్ర సింగ్ ధోనీ, దినేశ్ కార్తీక్ వంటి సీనియర్ వికెట్ కీపర్లు జట్టులో ఉండడం వల్ల పంత్ కు అవకాశం రాలేదన్న వాదనల నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ, ధోనీ, డీకే (దినేశ్ కార్తీక్)లు జట్టులో శాశ్వతంగా ఉండరని, వాళ్ల తర్వాత రిషభ్ పంతే టీమిండియా భవిష్యత్ వికెట్ కీపర్ అని స్పష్టం చేశారు.

ధోనీ, డీకేలతో పోలిస్తే పంత్ చాలా చిన్నవాడని,  ఈ ప్రపంచకప్ కు ఎంపిక కాకపోవడం పట్ల నష్టపోయినట్టుగా భావించనక్కర్లేదని అన్నారు. ఈ ఒక్క వరల్డ్ కప్ ను పక్కనబెడితే భవిష్యత్తులో ఇలాంటివి ఎన్నో ఆడతాడని గంగూలీ అభిప్రాయపడ్డారు. మరో 15 ఏళ్ల పాటు దేశానికి సేవలందించే సత్తా పంత్ లో ఉందని కితాబిచ్చారు. డీకే కూడా మంచి ఆటగాడేనని,  తాను సెలక్టర్ ను అయితే మాత్రం కచ్చితంగా పంత్ కే ఓటేస్తానని స్పష్టం చేశారు.

More Telugu News