Madhya Pradesh: మేం మళ్లీ అధికారంలోకి వస్తాం.. అప్పుడు చూస్తా!: కలెక్టర్ కు మధ్యప్రదేశ్ మాజీ సీఎం వార్నింగ్

  • మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ ఆగ్రహం
  • హెలికాప్టర్ ల్యాండింగ్ కు ఛింద్వారా కలెక్టర్ అనుమతి నిరాకరణ 
  • చివరి నిమిషంలో అనుమతివ్వకపోవడంపై మండిపాటు

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఛింద్వారా జిల్లా కలెక్టర్ పై కన్నెర్ర చేశారు. తన హెలికాప్టర్  ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకపోవడంపై ఘాటుగా స్పందించారు. మధ్యప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీఎం కమల్ నాథ్ కు కంచుకోట లాంటి ఛింద్వారాలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని తలపెట్టింది.

ఈ సమావేశానికి బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన పర్యటనను అడ్డుకున్న పోలీసులు, హెలికాప్టర్ ల్యాండింగ్ కు కలెక్టర్ నుంచి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో కోపంతో ఊగిపోయిన శివరాజ్..‘పశ్చిమ బెంగాల్‌లో మమత దీదీ హెలికాఫ్టర్ ల్యాండ్ కానివ్వడం లేదు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ దాదా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. డియర్ పిట్టూ కలెక్టర్, జాగ్రత్తగా విను.. మా రోజులు మళ్లీ వస్తాయి. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా?’ అని హెచ్చరించారు.

తమ సమావేశం సాయంత్రం 5.30 గంటలకు ఉండగా, హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి నిరాకరించిన విషయాన్ని తాపీగా అర గంట ముందు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

More Telugu News