Telangana: పదో తరగతి ఫెయిల్ అవుతానన్న భయంతో ప్రాణాలు తీసుకున్న బాలుడు!

  • తెలంగాణలోని హైదరాబాద్ లో ఘటన
  • ఫలితాలపై నమ్మకం కోల్పోయిన విద్యార్థి
  • ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణం

తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్ ఫలితాల రగడ నడుస్తోంది. చాలా మంది మెరిట్ విద్యార్థులు ఫెయిల్ అయిపోవడంతో వారి తల్లిదండ్రులు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పదో తరగతి విద్యార్థి కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని ఉప్పుగూడకు చెందిన ఓ బాలుడు ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు.

అయితే తాను పాస్ కాలేనని భయపడ్డాడు. ఒకవేళ ఫెయిల్ అయితే తల్లిదండ్రులకు ముఖం చూపించలేనని మనోవేదనకు గురయ్యాడు. చివరికి ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు ఎంతకూ గది నుంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు గది తలుపును బలవంతంగా తీశారు. లోపల ఫ్యాన్ కు వేలాడుతున్న పిల్లాడిని కిందకు దించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

కాగా, బాలుడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ఛత్రినాక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పోస్ట్ మార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

More Telugu News