Telangana: ప్రభుత్వానికి, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇవన్నీ అనవసర తలనొప్పులు: సీఎం కేసీఆర్

  • పరీక్షల నిర్వహణలో సమస్యలు నివారించాలి
  • మెరుగ్గా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాలపై అధ్యయనం చేయాలి
  • ఆ పద్ధతులను తెలంగాణలో అమలు చేయాలి

ఎంసెట్ వంటి పరీక్షల్లోనూ ప్రతిసారి ఇబ్బందులు వస్తున్నాయని, ప్రభుత్వానికి, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇవన్నీ అనవసర తలనొప్పులని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం కారణంగా నిరసనలు తీవ్రతరం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తో సీఎం కేసీఆర్ సమీక్షించారు.  

 పరీక్షల నిర్వహణలో సమస్యలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని, మెరుగ్గా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాలను అధ్యయనం చేయాలని, అక్కడ అనుసరిస్తున్న పద్ధతులను తెలంగాణలో అమలు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో తలనొప్పులు లేని పరీక్షా విధానం తీసుకురావాలని, పరీక్షల నిర్వహణలో తలనొప్పులు నివారించడం అసాధ్యమేమీ కాదని అధికారులకు కేసీఆర్ సూచించారు.

ఇంటర్ బోర్డుకు సహకరించే ఏజెన్సీల ఎంపిక గురించి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ-ప్రొక్యూర్ మెంట్ లో ఆహ్వానించి ఏజెన్సీలను ఎంపిక చేశామని, తక్కువ రేట్ కోట్ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు చెప్పారు. టెండర్లు వేసిన సంస్థల సామర్ధ్యాన్ని నిపుణులు, బోర్డు కమిటీ క్షుణ్ణంగా తెలుసుకుందని గుర్తుచేశారు. టెండర్లు, ఇతర ప్రక్రియలు నిబంధనల మేరకే జరిగాయని కేసీఆర్ కు అధికారులు వివరించారు.

More Telugu News