Kakinada: ఇంటర్ బోర్డ్ తప్పిదం వల్ల 23 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు: గవర్నర్‌కు రేవంత్ లేఖ

  • 3 లక్షల మంది విద్యార్థుల ఫలితాల్లో తప్పులు
  • విద్యార్థులను, తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు
  • తప్పులు జరగకుంటే విచారణ కమిటీ ఎందుకు?

గతంలో కాకినాడ జేఎన్టీయూ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన అర్హత లేని గ్లోబరీనా సంస్థకు డేటా సేకరణ కాంట్రాక్ట్ అప్పగించారని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై నేడు ఆయన గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. ఇంటర్ బోర్డు వ్యవహారంపై స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని లేఖలో రేవంత్ కోరారు. ఇంటర్ బోర్డ్ తప్పిదం వల్ల 23 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, 3 లక్షల మంది విద్యార్థుల ఫలితాల్లో తప్పులు దొర్లాయని అన్నారు.

ఇంటర్ బోర్డు ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడిగాపులు కాస్తున్నా పట్టించుకోవట్లేదన్నారు. 2015లో మీరే గ్లోబరీనా సంస్థపై విచారణకు ఆదేశించారని లేఖలో రేవంత్ గుర్తు చేశారు. తప్పులు జరగకుంటే విచారణ కమిటీని ఎందుకు వేశారని ప్రశ్నించారు. విద్యాశాఖామంత్రి జగదీశ్‌రెడ్డి తన బాధ్యతారాహిత్య ప్రకటనలతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.

More Telugu News