kavitha: కవిత చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: ధర్మపురి అరవింద్

  • మోదీపై పోటీ చేస్తామంటున్న రైతులెవరూ పసుపు పండించరు
  • వారణాసికి వెళ్లడానికి వీరికి టికెట్లు ఎవరు సమకూర్చుతున్నారు?
  • టీఆర్ఎస్ ప్యాకేజీలో భాగంగానే నామినేషన్లు వేస్తున్నారు

ప్రధాని మోదీపై వారణాసి లోక్ సభ స్థానం నుంచి పోటీకి నిజామాబాద్ పసుపు రైతులు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీజేపీ నేత ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రోత్సాహంతోనే మోదీపై పోటీకి రైతులు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో రైతులు పోటీ చేయనుండటం రాజకీయ ప్రోద్బలమేనని అన్నారు. మొన్న నిజామాబాద్ లో పోటీ చేసిన రైతుల్లో ఒక్కరు కూడా వారణాసిలో నామినేషన్ వేస్తామన్నవారిలో లేరని చెప్పారు. పోటీకి దిగుతామంటున్న రైతులంతా టీఆర్ఎస్ నేతలేనని అన్నారు.

మోదీపై పోటీ చేస్తామంటున్న రైతులెవరూ పసుపు పండించరని అరవింద్ చెప్పారు. వారణాసికి వెళ్లడానికి వీరందరికీ టికెట్లు ఎవరు సమకూర్చుతున్నారని ప్రశ్నించారు. ప్యాకేజీలో భాగంగానే వీరు నామినేషన్లు వేస్తున్నారని అన్నారు. పసుపు బోర్డు కోసం కవిత చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. బోర్డు ఏర్పాటు చేస్తామని బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారని చెప్పారు. బీజేపీ హామీని జీర్ణించుకోలేకే కవిత చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

More Telugu News