Telangana: ఒప్పందం లేకుండానే ‘గ్లోబరినా’కు కాంట్రాక్టు.. బయటపడుతున్న తెలంగాణ ఇంటర్ బోర్డు లీలలు!

  • ఆత్మహత్య చేసుకున్న 19 మంది విద్యార్థులు
  • త్రిసభ్య కమిటీని నియమించిన ప్రభుత్వం
  • ఈరోజు రెండోసారి సమావేశం కానున్న కమిటీ
  • రేపు తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పణ

తెలంగాణలో ఇంటర్ ఫలితాల ప్రకటనలో చెలరేగిన గందరగోళం కారణంగా 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డుకు సాంకేతిక సేవలు అందించిన గ్లోబరినా సంస్థకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటర్‌ పరీక్షలు, ఫలితాలకు సంబంధించి డేటా ప్రాసెసింగ్‌, ఫలితాల విడుదల ప్రక్రియపై గ్లోబరినా సంస్థ, ఇంటర్ బోర్డు మధ్య చట్టబద్ధమైన ఒప్పందం ఏదీ లేదని తేలింది. తెలంగాణ ప్రభుత్వం నియమించిన త్రిసభ్య విచారణ కమిటీ ఈ విషయాన్ని గుర్తించింది. కేవలం పర్చేజింగ్ ఆర్డర్ తోనే గ్లోబరినా సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించారని కమిటీ తేల్చింది.

ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌, గ్లోబరినా సంస్థ సీఈఓ వీఎస్‌ఎన్‌ రాజు, ఇంటర్‌బోర్డు ఓఎస్‌డీ సుశీల్‌కుమార్‌ సహా ఇతర ఉన్నతాధికారులతో నిన్న ఈ త్రిసభ్య కమిటీ సమావేశమయింది. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డుతో ఒప్పందానికి సంబంధించి ఎలాంటి రికార్డులు తమవద్ద లేవని గ్లోబరినా ప్రతినిధులు చేతులు ఎత్తేశారు. ఈ నేపథ్యంలో వాటిని తప్పనిసరిగా తీసుకురావాలని కమిటీ ఆదేశించింది. కాగా, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చైర్మన్ వెంకటేశ్వరరావు, సభ్యులు వాసన్‌, నిశాంత్ లు మరోసారి సమావేశం కానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, రేపు ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశముందని భావిస్తున్నారు.

More Telugu News