pawan kalyan: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత: పవన్ కల్యాణ్

  • 17 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం
  • విద్యార్థుల తల్లిదండ్రులకు పరిహారం చెల్లించాలి
  • బోర్డు అధికారులు, ఐటీ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలి

తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకలకు పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును ఇంటర్ బోర్డు అగమ్యగోచరంగా మార్చడం దారుణమని చెప్పారు. 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు.

విద్యార్థులపై అధికారులు ఎదురుదాడి చేసేలా మాట్లాడుతుండటాన్ని ఖండిస్తున్నామని పవన్ చెప్పారు. పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యుయేషన్ నుంచి ఫలితాల వెల్లడి వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయని... వాటిని నివృత్తి చేయాలని, నిజాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ చేయాలని అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన పిల్లల తల్లిదండ్రులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

జీవితం చాలా విలువైనది, నిరాశతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని పవన్ సూచించారు. విద్యార్థులకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తప్పిదాలకు కారణమైన బోర్డు అధికారులు, సాఫ్ట్ వేర్ సంస్థపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

More Telugu News