lakshmi narayana: చంద్రబాబుని వదిలేసి జగన్ వెంటే ఎందుకు పడ్డారన్న ప్రశ్నకు లక్ష్మీ నారాయణ సమాధానం ఇది!

  • చంద్రబాబుపైనా కేసు రిజిస్టర్ చేశాము
  • హైకోర్టు స్టే ఇవ్వడంతో విచారణ ఆపేశాం
  • ఓ ఇంటర్వ్యూలో వీవీ లక్ష్మీనారాయణ

తాను సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో వైఎస్ జగన్ ను ఎక్కడున్నాడో వెతికి వెంట పడ్డారని, చంద్రబాబుపై కేసుల విచారణకు మాత్రం సిబ్బంది లేదని తప్పించుకున్నారని వచ్చిన ఆరోపణలన్నీ, కొందరు సృష్టించిన అపోహలేనని వీవీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. "మేము 2006 సంవత్సరంలో ఔటర్ రింగ్ రోడ్ కేసులు చేస్తున్నాం. దాని అలైన్ మెంట్ లు కొంతమంది స్వార్థపూరితంగా మార్చారని, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ స్థలాన్ని తీసుకున్నారని... ఇలాంటి ఐదారు సబ్జెక్ట్ లు వచ్చాయి.

 అవి చేస్తున్నప్పుడే, ఇంకొక రిఫరెన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఐఎంజీ భరత అనే కంపెనీకి ఎంతో విలువచేసే భూమిని తక్కువ రేటుతో అప్పగించారన్న విషయంలో ఎంక్వయిరీ చేయమని చెప్పారు. జనరల్ గా స్టేట్ గవర్నమెంట్ అనేక విషయాలను సీబీఐ మీద తోసేయడానికి ప్రయత్నిస్తుంది. భూమి విలువ వారికి తెలుసు. నేనప్పుడు డీఐజీగా ఉండేవాడిని. నిర్ణయం తీసుకునే అధికారం నా దగ్గర లేదు. నేను నా లెటర్ లో రాసి పంపించాను. ఎంక్వయిరీ చేయడానికి అనుమతి కోరాను. అప్పట్లో మా జేడీ చెన్నైలో ఉండేవారు. ఆయనేం చేశారంటే, ఆల్ రెడీ మేము ఐదారు కేసులు చేస్తున్నామని గుర్తు చేస్తూ, ప్రభుత్వాన్నే ప్రాథమిక విచారణ జరిపించి, నేరం ఉందని భావిస్తే, మరోసారి సీబీఐకి రిఫర్ చేయాలని సూచించారు. ఆపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇది ఒక కేసు".

"ఆపై 2011లో అనుకుంటా... హైకోర్టు నుంచి ఆదేశాలు అందాయి. అప్పుడు చంద్రబాబునాయుడిపై  ఓ ప్రిలిమినరీ విచారణకు ఆదేశాలు అందగా, కేసు రిజిస్టర్ చేశాం. విచారణ జరుగుతూ ఉండగానే హైకోర్టు నుంచే స్టే ఆర్డర్ వచ్చింది. స్టే రావడం వల్ల దాన్ని మేము ఆపేశాం. సుప్రీంకోర్టుకు వెళ్లినా రిలీఫ్ రాలేదు. ఇదీ సిచ్యుయేషన్" అని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. సీబీఐ బేసిక్ వర్క్ యాంటీ కరప్షన్ అని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కేసులన్నీ ఒకే రకంగా ఉంటాయని, సాధారణంగా తాము వారినే కేసు ప్రాథమిక విచారణ చేయాలని చెబుతుంటామని, హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి వస్తే మాత్రం తక్షణం రిజిస్టర్ చేసి, విచారణ ప్రారంభిస్తుంటామని, ఈ విషయంలో మాత్రం మరో ఆప్షన్ ఉండదని అన్నారు.

More Telugu News