Andhra Pradesh: మూడు పథకాలపై ఏపీ సీఎస్ సమీక్ష.. మండిపడ్డ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు!

  • బడ్జెట్ లోనే వీటికి కేటాయింపులు చేశాం
  • కోడ్ పరిధిలోకి రావని కోర్టులే చెప్పాయి
  • ఇప్పుడు సీఎస్ సమీక్ష నిర్వహించడం సరికాదు

పసుపు-కుంకుమ, పింఛన్లు, రైతులకు పెట్టుబడి సాయం వంటి పేదల పథకాలకు నిధుల విడుదలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించడాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తప్పుపట్టారు. ఈ పథకాల అమలుకు బడ్జెట్ లో నిధులు లేవని చెప్పడంపై యనమల అభ్యంతరం వ్యక్తం చేశారు.

అన్నదాతా సుఖీభవ పథకానికి రూ.5,000 కోట్లు, పసుపు-కుంకుమ పథకానికి రూ.4,000 కోట్లు బడ్జెట్ లో కేటాయించామని గుర్తుచేశారు. ఈ పథకాలతో పాటు పింఛన్ల కేటాయింపు విషయాన్ని బడ్జెట్ లో స్పష్టంగా పేర్కొన్నామన్నారు.

ఎన్నికల కోడ్ రాకముందే రైతులు, మహిళలకు చెక్కులు అందజేశామని యనమల తెలిపారు. బడ్జెట్ లో ఉన్న ఈ పథకాలు ఎన్నికల కోడ్ కిందకు రావని ఇప్పటికే కోర్టులు స్పష్టం చేశాయని యనమల అన్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు కోర్టుల్లో వేసిన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయని గుర్తుచేశారు. కాబట్టి అలాంటి పథకాలపై ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించడం సరికాదన్నారు.

More Telugu News