Telangana: ఇంటర్ బోర్డ్ కార్యాలయం నుంచి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కు విస్తరించిన నిరసనలు!

  • ఇంటర్ ఫలితాల్లో గందరగోళం
  • ఇప్పటివరకూ 18 మంది ఆత్మహత్య
  • సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నం
  • పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు

తెలంగాణ ఇంటర్ మీడియట్ బోర్డ్ చేసిన తప్పిదాలతో ఇంతవరకూ 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా, గత మూడు రోజుల నుంచి కొనసాగుతున్న నిరసనల సెగ నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ ను తాకింది. నిన్నటివరకూ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నాలకు దిగిన విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరారు. వీరందరినీ పంజాగుట్ట రాజీవ్ గాంధీ విగ్రహం వద్దే అడ్డుకున్న పోలీసులు, పలువురిని బలవంతంగా అరెస్ట్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని తాము శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే, ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ లు చేయిస్తోందని ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు.

ఇదిలావుండగా ఇంటర్ బోర్డ్ వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. మూడంచెల భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అనుమతించడం లేదు. మరోవైపు రీవాల్యుయేషన్ కు దరఖాస్తు గడువును రెండు రోజుల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫలితాల అంశం రాజకీయ రంగును పులుముకుంది. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని విపక్షాలు తీవ్ర విమర్శలకు దిగుతుంటే, విద్యార్థులను కాంగ్రెస్, బీజేపీలు రెచ్చగొడుతున్నాయని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

More Telugu News