puranik yogendra: జపాన్ అసెంబ్లీకి ఎన్నికైన ‘యోగి’.. తొలి భారతీయ మూలాలున్న వ్యక్తిగా రికార్డు

  • టోక్యోలోని ఎడొగావా వార్డుకు ఎన్నికైన పురానిక్ యోగేంద్ర
  • జపనీయులు-విదేశీయుల మధ్య సత్సంబంధాల కోసం కృషి చేస్తానన్న యోగి
  • ఎన్నికల్లో 6,477 ఓట్లు కొల్లగొట్టిన యోగేంద్ర

41 ఏళ్ల భారత సంతతి జపాన్ వ్యక్తి టోక్యో ఎడొగావా వార్డ్ అసెంబ్లీకి ఎన్నికై చరిత్ర సృష్టించారు. జపాన్ ఎన్నికల్లో గెలిచిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కిన ఆయన పేరు పురానిక్ యోగేంద్ర కాగా, అందరూ ‘యోగి’ అని పిలుస్తుంటారు. ఈ నెల 21 జరిగిన ఎన్నికల్లో యోగి మొత్తం 6,477 ఓట్లు సాధించారు. దేశవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో యోగి విజయం సాధించినట్టు జపాన్ డైలీ తెలిపింది.

జపాన్‌లోని కాన్సిస్ట్యూషనల్ డెమొక్రటిక్ పార్టీకి చెంది యోగి విజయం సాధించిన అనంతరం మాట్లాడుతూ.. జపనీయులు-విదేశీయులకు మధ్య సత్సంబంధాల కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. జపాన్ చాలా పరిశుభ్రంగా ఉంటుందని, ఇక్కడందరూ దయార్ద్ర హృదయులని యోగి పేర్కొన్నారు.

టోక్యోలోని 23వ వార్డు అయిన ఎగొగావాలో అత్యధిక మంది భారతీయ సంతతి వారే. ఈ వార్డులో మొత్తం 4,300 మంది భారతీయుల సంతతి నివస్తున్నట్టు అక్కడి రికార్డులు చెబుతున్నాయి. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 34 వేల మంది భారతీయుల సంతతి  నివసిస్తుండగా, వారిలో పదిశాతానికి పైగా ఇక్కడే ఉండడం గమనార్హం.

యోగి యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు 1997లో జపాన్ వచ్చారు. రెండేళ్ల చదువు తర్వాత తిరిగి ఇండియా వచ్చిన యోగి 2001లో తిరిగి ఇంజినీర్‌గా జపాన్‌లో అడుగుపెట్టారు. బ్యాంకులు, ఇతర కంపెనీల్లో పనిచేసిన ఆయన 2005 నుంచి ఎడొగావా వార్డులో ఉంటున్నారు.

More Telugu News