Chiranjeevi: తెలంగాణ ఫైర్ మ్యాన్ సాహసానికి మెచ్చి లక్ష రూపాయలు ఇచ్చిన చిరంజీవి

  • డ్రైనేజి గుంతలో పడిన చిన్నారి
  • కాపాడిన ఫైర్ మ్యాన్
  • చిరు తరఫున చెక్ అందించిన అల్లు అరవింద్

సినిమాల్లో ఎన్నో థ్రిల్స్ చేసే మెగాస్టార్ చిరంజీవి అంతటివాడిని ఓ ఫైర్ మ్యాన్ సాహసం ఎంతో ఆకట్టుకుంది. గౌలిగూడలో నివాసం ఉండే చంద్రకాంత్, లత దంపతుల నాలుగేళ్ల పాప దివ్య ఆడుకుంటూ డ్రైనేజి గుంతలో పడిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గౌలిగూడ ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ పాపను కాపాడారు. ముఖ్యంగా, ఫైర్ మ్యాన్ క్రాంతికుమార్ తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా నిచ్చెన, తాడు సాయంతో 12 అడుగుల లోతున్న గుంతలో దిగి పాపను ఎంతో తెలివిగా బయటికి తీసుకువచ్చారు.

గుంతలో పడిన 10 నిమిషాల్లోనే బయటికి తీసుకురావడంతో చిన్నారి దివ్యకు  పెద్ద గండం తప్పింది. అనంతరం ప్రాథమిక చికిత్స చేయించారు. మీడియాలో ఈ విషయం బాగా ప్రచారం అయింది. సైరాతో బిజీగా ఉన్న చిరంజీవి కూడా ఈ ఘటనపై ఆసక్తి చూపించారు. ఆ ఫైర్ మ్యాన్ తెగువ ఆయననను విశేషంగా ఆకర్షించింది. వెంటనే లక్ష రూపాయల చెక్ ను తన బావమరిది అల్లు అరవింద్ ద్వారా ఆ ఫైర్ మ్యాన్ కు అందజేశారు.

చిరు తన పేరిట ఉన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ నజరానా ప్రకటించారు. చిరంజీవి తరఫున చెక్ తీసుకువచ్చిన అరవింద్ ఫైర్ మ్యాన్ క్రాంతికుమార్ ను శాలువాతో సత్కరించి, ఫ్లవర్ బొకే అందించారు.

More Telugu News