Andhra Pradesh: ఏపీని సీఎస్, ఈసీ పరిపాలించాలని విజయసాయిరెడ్డి కోరుకుంటున్నారు: సోమిరెడ్డి

  • ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పాలించ కూడదని ఆలోచిస్తున్నారు
  • ఆ ఆలోచన విజయసాయిరెడ్డి, ఆయన బృందానిది
  • సమీక్షలు నిర్వహించవచ్చని సీఈసీ స్పష్టంగా చెప్పింది

ఏపీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పరిపాలన చేయకూడదని వైసీపీ విజయసాయిరెడ్డి, ఆయన బృందం ఆలోచిస్తోందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీని సీఎస్, ఈసీ పరిపాలించాలని వారు కోరుకుంటున్నారని విమర్శించారు.

ఎన్నికల అనంతరం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం తప్ప ఏపీ ప్రభుత్వం యథాతథంగా విధులు నిర్వర్తిస్తుందన్న విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పిందని అన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం సమీక్షలు నిర్వహించవచ్చన్న విషయాన్నీ చాలా స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణలో ఇంటర్ మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకల అంశం గురించి సోమిరెడ్డి ప్రస్తావించారు. ఈ సంఘటనలో బాధ్యత వహించేది ఎన్నికల సంఘమా? లేక ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. విద్యార్థుల మృతికి తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News