Gujarath: గుజరాత్ అల్లర్ల సమయంలో గ్యాంగ్ రేప్ కు గురైన మహిళకి రూ.50 లక్షలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశం!

  • బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు
  • బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశం
  • 2002లో మతఘర్షణల సందర్భంగా దారుణం

గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మోదీ ప్రధానిగా ఉండగా 2002లో చెలరేగిన మతఘర్షణల్లో 22 సార్లు గ్యాంగ్ రేప్ కు గురైన బిల్కిస్ బానోకు రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అలాగే ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనీ, నిబంధనల మేరకు బానోకు నివాసం కల్పించాలని సూచించింది. 2002, మార్చి 3న గుజరాత్ లోని దహోద్ లో ఉన్న రంథిక్ పూర్ గ్రామంపై అతివాద హిందుత్వ మూకలు దాడిచేశాయి. గోద్రా రైలు దహనం అనంతరం పగతో రగిలిపోయిన ఈ అల్లరిమూకలు బిల్కిస్ బానో కుటుంబంపై దాడిచేశాయి.

ఈ సందర్భంగా బానో తల్లి, చెల్లి, కుమార్తె, ఇతర బంధువులను దుండగులు కత్తులతో నరికి చంపారు.  19 ఏళ్లకే గర్భిణిగా ఉన్న బానోను కూడా వారు విడిచిపెట్టలేదు. ఆమెపై 22 సార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి చనిపోయినట్లు నటించిన బానో, వారి బారి నుంచి తప్పించుకుంది. ఆమె కుటుంబంలో చివరికి బానోతో పాటు ఇద్దరు మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలో బానో  పోలీసులను ఆశ్రయించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

వైద్యులు కూడా సహకరించలేదు. చివరకు 2004లో ఈ అఘాయిత్యంపై కేసు నమోదయింది. బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడ్డ 11 మందికి ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. అంతకుముందు గుజరాత్ ప్రభుత్వం బానోకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించగా, ఆమె దాన్ని తిరస్కరించారు.

More Telugu News