srilanka blasts: విధి చిత్రం... ఒకచోట తప్పించుకున్నా మరోచోట కాటేసిన మృత్యువు!

  • శ్రీలంక బాంబు పేలుళ్లలో తోబుట్టువులు మృతి
  • రెస్టారెంట్‌ పేలుడు నుంచి తప్పించుకున్న అన్న, చెల్లెలు 
  • హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటుండగా మరో పేలుడులో మృతి

విహార యాత్రకని శ్రీలంకకు వచ్చిన ఆ అన్నాచెల్లెళ్లను మృత్యువు వెంటాడి మరీ కాటేసింది. ఒక పేలుడు ఘటన నుంచి తప్పించుకున్నా మరో పేలుడు ఘటన వారిని పొట్టన పెట్టుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలావున్నాయి. బ్రిటన్‌కు చెందిన డేనియల్‌ (19), అతని సోదరి అమీలీ (15)లు తల్లిదండ్రులతో కలిసి విహార యాత్ర నిమిత్తం శ్రీలంకకు వచ్చారు. ఈస్టర్‌ పర్వదినం రోజుతో వారి యాత్ర ముగిసి తిరిగి స్వదేశానికి వెళ్లాల్సి ఉంది. పర్యటన చివరి రోజు డేనియల్‌ కుటుంబం స్థానిక టేబుల్‌ వన్‌ కేఫ్‌లో కూర్చుని తింటుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటన నుంచి వారి కుటుంబం ఎలాగోలా బయటపడింది.

బతుకు జీవుడా అంటూ వీరు తాము బసచేస్తున్న షాంగ్రిలా హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ మరో పేలుడు జరగడంతో డేనియల్‌, అమీలీ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగానే చనిపోయినట్లు డేనియల్‌ తల్లిదండ్రులు వాపోయారు. శ్రీలంక పేలుళ్లలో మొత్తం 310 మంది చనిపోగా అందులో 8 మంది బ్రిటీషర్లు ఉన్నారు.

More Telugu News