sri lanka: శ్రీలంకలో 310కి చేరిన మృతుల సంఖ్య... 40 మంది అరెస్ట్

  • అరెస్ట్ అయిన వారంతా శ్రీలంక జాతీయులే
  • విదేశీ దౌత్యవేత్తలు, హై కమిషనర్లతో భేటీ కానున్న శ్రీలంక అధ్యక్షుడు
  • అంతర్జాతీయ ఉగ్ర సంస్థల హస్తం ఉందన్న రక్షణశాఖ

క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన ఈస్టర్ పర్వదినం సందర్భంగా శ్రీలంకలో చోటు చేసుకున్న వరుస పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు అక్కడ నెత్తుటి ఏర్లు పారించాయి. ఈ పేలుళ్ల మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 8 పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 310కి చేరుకుంది.

మృతులలో ఎనిమిది మంది భారతీయులు ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు, 40 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్నవారిని కస్టడీకి తరలించామని... వీరంతా శ్రీలంక జాతీయులేనని శ్రీలంక పోలీస్ అధికార ప్రతినిధి ఎస్పీ రువాన్ గుణశేఖర తెలిపారు.

ఇదిలా ఉంచితే, విదేశీ దౌత్యవేత్తలు, హై కమిషనర్లతో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పేలుళ్ల గురించి వారికి వివరించడమే కాక, అంతర్జాతీయ సహకారాన్ని ఆయన కోరనున్నారు.

స్థానిక టెర్రరిస్టుల వెనుక అంతర్జాతీయ ఉగ్ర సంస్థల హస్తం ఉందని శ్రీలంక రక్షణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో, ఈ ఘటన దర్యాప్తు కోసం అంతర్జాతీయ సహకారాన్ని కోరనున్నామని వెల్లడించింది.

More Telugu News