Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్.. పార్టీని వీడిన గండ్ర దంపతులు.. కేటీఆర్‌తో భేటీ

  • తెలంగాణలో కాంగ్రెస్ విలవిల
  • పార్టీకి గండ్ర దంపతులు గుడ్‌బై
  • జ్యోతికి జెడ్పీ చైర్ పర్సన్ పదవి

టీఆర్ఎస్ ఆకర్ష్ దెబ్బకు తెలంగాణలో కాంగ్రెస్ విలవిల్లాడుతోంది. పార్టీకి చెందిన నేతలంతా ఒక్కొక్కరుగా వీడుతుండడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. సోమవారం రాత్రి ఆయన భార్య జ్యోతితో కలిసి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకే పార్టీ మారుతున్నట్టు ఆయన తెలిపారు.  

గండ్ర భార్య జ్యోతికి జెడ్పీ చైర్ పర్సన్ పదవి ఇస్తామన్న హామీతోనే వారు టీఆర్ఎస్‌లో చేరేందుకు మొగ్గుచూపినట్టు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గండ్ర దంపతులు పార్టీని వీడడం కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బేనని అంటున్నారు. కాగా, ఇటీవల కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పార్టీని వీడుతున్నట్టు వార్తలు వచ్చాయి. గండ్రతోపాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తదితరులు టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. దీంతో స్పందించిన నేతలంతా ఆ వార్తలను ఖండించారు. అయితే, అంతలోనే గండ్ర దంపతులు పార్టీని వీడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

More Telugu News