Balasubrahmanyam: చిన్న చిన్న పొరపాట్లపై పునరాలోచించాలి: ద్వివేదిని కోరిన ఎమ్మెల్సీలు

  • ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌లను ఎత్తివేయాలి
  • ఎవరో తప్పులకు బాధ్యులను చేయడం సరికాదు
  • ఆయాలను పోలింగ్ ఆఫీసర్లుగా నియమించినందునే తప్పులు

ఎన్నికల విధుల్లో భాగంగా చిన్న చిన్న పొరపాట్లు చేసిన ఉపాధ్యాయులపై చర్యల విషయంలో పునరాలోచించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని.. ఏపీ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ లక్ష్మణరావు కోరారు. నేటి సాయంత్రం సీఈవోతో ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. అనంతరం బాలసుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ, ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించారంటూ వేసిన సస్పెన్షన్‌లను ఎత్తివేయాలని కోరినట్టు తెలిపారు.

ఎవరో చేసిన తప్పులకు ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం సరికాదని, ఇలాగే చర్యలు తీసుకుంటూ పోతే ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉపాధ్యాయులు భయపడతారని తెలిపారు. ఎన్నికల్లో వేల కోట్ల ధన ప్రవాహం జరిపిన పార్టీలపై చర్యలు తీసుకోలేదని బాలసుబ్రహ్మణ్యం విమర్శించారు. అనుభవం లేని ఆయాలను పోలింగ్ ఆఫీసర్లుగా నియమించినందునే తప్పులు జరిగాయన్నారు. ఉపాధ్యాయుల రెమ్యునరేషన్ విషయంలో కూడా స్పష్టత లేదని, జిల్లాకో రకంగా రెమ్యునరేషన్ చెల్లించారని విమర్శించారు.

More Telugu News