Telangana: అర్హులైన అధ్యాపకులతోనే మూల్యాంకనం చేయించాం: ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్

  • అనర్హులు మూల్యాంకనం చేశారన్న ఆరోపణలు అబద్ధం
  • ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ చేయడంలో కొన్ని పొరపాట్లు
  • అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నాయి, సరిచేస్తాం

ఇంటర్ మీడియట్ పేపర్లను అనర్హులైన అధ్యాపకులతో మూల్యాంకనం చేయించారన్న ఆరోపణలు అవాస్తవమని, అర్హులైన తమ అధ్యాపకులతోనే మూల్యాంకనం చేయించామని ఇంటర్ మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై  ఆయన వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరి చేస్తామని చెప్పారు. ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ చేయడంలో కొన్ని పొరపాట్లు జరిగాయని, టోటల్ మార్కుల వద్ద ’99’ వేయాల్సి ఉండగా ’00‘ వేశారని, తప్పులు దొర్లిన ముగ్గురు విద్యార్థులు మార్కులు సవరించామని చెప్పారు. విద్యార్థుల ఓఎంఆర్ షీట్లు గల్లంతు కాలేదని, పోలీసుల నిఘా మధ్య జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇంటర్ ఫలితాలు రూపొందించే క్రమంలో గ్లోబెరినా టెక్నాలజీ సంస్థ సేవలు తీసుకున్నామని చెప్పారు.

కాగా, ఇంటర్ ఫలితాలపై వచ్చిన ఆరోపణలపై విచారణకు జీవో 41 జారీ అయింది. బోర్డుతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గ్లోబెరినా టెక్నాలజీ సంస్థ విధులు నిర్వహించిందా? లేదా? అనే విషయమై, ఆ ఏజెన్సీకి తగినంత సిబ్బంది ఉన్నారా? లేరా? ఇంటర్ బోర్డు అవసరాలకు అనుగుణంగా ‘గ్లోబెరినా’ సాఫ్ట్ వేర్ ఉందా? ఏజెన్సీ లోపాల వల్ల తప్పులు వచ్చాయా? అనే అంశాలపై విచారణ చేయాలని ఆ జీవోలో ఆదేశించారు. ఇంటర్ మీడియట్ ఫలితాల్లో ఎటువంటి తప్పులు జరగకుండా అన్ని సూచనలు ఇవ్వాలని, మూడ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని త్రిసభ్య కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.

More Telugu News