Anders Holch Povlsen: శ్రీలంక పేలుళ్లలో ముగ్గురు పిల్లలను కోల్పోయిన డెన్మార్క్ అత్యంత సంపన్నుడు

  • వేసవి సెలవుల కోసం శ్రీలంకకు వెళ్లిన ఆండర్స్
  • నలుగురు పిల్లలలో ముగ్గురు దుర్మరణం
  • 5.7 బిలియన్ డాలర్ల సంపదకు అధిపతి ఆండర్స్

దశాబ్ద కాలంగా ఎంతో ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో ముష్కరులు నెత్తుటి ఏర్లు పారించారు. ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడుల్లో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో విదేశీయుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

మరో విషాదం ఏమిటంటే... డెన్మార్క్ దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఆండర్స్ హోల్చ్ పోవ్ల్ సెన్ (46) ఈ దాడుల్లో తన నలుగురు పిల్లల్లో ముగ్గురిని కోల్పోయారు. ఈ మేరకు ఆండర్స్ కు చెందిన ఫ్యాషన్ సంస్థ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. అంతకు మించి సమాచారాన్ని ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. మరోవైపు, ఆండర్స్ కుటుంబం సెలవులను గడపడానికి శ్రీలంకకు వెళ్లిందని డానిష్ మీడియా తెలిపింది. అయితే శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లలో ఏ పేలుడు కారణంగా వారు చనిపోయారో మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఆండర్స్ కు బెస్ట్ సెల్లర్ అనే ఫ్యాషన్ సంస్థ ఉంది. జాక్ అండ్ జోన్స్, వేరో మోడా అనే బ్రాండ్స్ కు ఆయన అధిపతి. అంతేకాకుండా ఆన్ లైన్ రీటైలర్ సంస్థ ఆసోస్ తో పాటు జలాండోలో ఆయనకు మెజార్టీ వాటాలు ఉన్నాయి. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం స్కాట్ లాండ్ లోని మొత్తం భూభాగంలో ఒక శాతం భూమి (2 లక్షల ఎకరాలు) ఆయనదే. ఆయన నెట్ వర్త్ 5.7 బిలియన్ డాలర్లుగా బ్లూంబర్గ్ లెక్కకట్టింది.

More Telugu News