jagga reddy: ప్రతిసారీ నేను ఆ వార్తలను ఖండించలేను: జగ్గారెడ్డి

  • కాంగ్రెస్ లో ఉంటానా, టీఆర్ఎస్ లోకి వెళ్తానా అనేది కాలం నిర్ణయిస్తుంది
  • పార్టీ మారడం ఎమ్మెల్యేల వ్యక్తిగతం
  • సంగారెడ్డి కష్టాలకు హరీష్ రావే కారణం

టీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తల పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పుకార్లను మాటి మాటికీ తాను ఖండించలేనని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానా? లేక టీఆర్ఎస్ లోకి వెళతానా? అనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదని.... ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నం టీఆర్ఎస్సే చేస్తోందని విమర్శించారు.

పార్టీ మారడం ఎమ్మెల్యేల వ్యక్తిగత విషయమని, అయితే పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ ను విమర్శించడం మాత్రం సరికాదని జగ్గారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీ కేడర్ లో ఆత్మవిశ్వాసం దెబ్బతినదని చెప్పారు. సంగారెడ్డి తాగునీటి కష్టాలకు టీఆర్ఎస్ నేత హరీష్ రావే కారణమని మండిపడ్డారు. ప్రజలకు కష్టాలు ఉన్నంత కాలం రాజకీయ నాయకులకు ఢోకా ఉండదని... ప్రజల కష్టాలు తీరవు, నాయకుల ప్రాబల్యం తగ్గదని అన్నారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలు బాధాకరమని చెప్పారు. బాధ్యాతారహితంగా వ్యవహరించిన అధికారులపై సీఎం కేసీఆర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News