Chiranjeevi: ఏడాది క్రితం కొడుకు పుట్టినా పేరుపెట్టని అభిమాని.. ఇంటికి పిలిచి 'పవన్ శంకర్' అని నామకరణం చేసిన చిరంజీవి

  • అభిమాని ఆకాంక్ష
  • మెగాస్టారే నామకరణం చేయాలంటూ కోరిక
  • అభిమాని ముచ్చట తీర్చిన చిరు

మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనసుకు ఉదాహరణగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా మందపల్లి గ్రామానికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు చిరంజీవికి వీరాభిమాని. గతేడాది ఆయనకు ఓ కొడుకు పుట్టాడు. అయితే, తన బిడ్డకు మెగాస్టారే స్వయంగా నామకరణం చేయాలని, లేకపోతే పేరు పెట్టనని వెంకటేశ్వరరావు అందరితోనూ చెప్పుకున్నాడు.

ఈ విషయం చివరికి చిరంజీవి వరకు రావడంతో ఆయన ఆశ్చర్యపోయారు. వెంటనే నక్కా వెంకటేశ్వరరావును భార్యాబిడ్డలతో సహా తన ఇంటికి ఆహ్వానించారు.  దాంతో ఆ అభిమాని పట్టరాని ఆనందంతో పొంగిపోయాడు. వెంటనే తన భార్యను, ముగ్గురు పిల్లలను తీసుకుని చిరు నివాసానికి వచ్చాడు. తన ఇంటికి వచ్చిన వీరాభిమానిని ఆత్మీయంగా స్వాగతించిన చిరంజీవి, అతడి కొడుక్కు తనకు ఎంతో ఇష్టమైన 'పవన్ శంకర్' అనే పేరు పెట్టారు.

తన బిడ్డకు మెగాస్టార్ నామకరణం చేయడంతో వెంకటేశ్వరరావు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ అభిమాని కుటుంబంతో చిరంజీవి దాదాపు గంటసేపు ముచ్చటించి వారి జీవితంలో మర్చిపోలేని విధంగా అతిథి సత్కారాలు చేశారు.

కాగా, నక్కా వెంకటేశ్వరరావు ప్రజారాజ్యం సమయంలో పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. ప్రజారాజ్యం పార్టీలో చేరాడన్న కారణంతో వెంకటేశ్వరరావును ఐదేళ్లపాటు గ్రామం నుంచి వెలివేశారు. అప్పట్లో ఈ విషయం తెలిసిన చిరంజీవి వెంకటేశ్వరరావును ఇంటికి పిలిచి ఒక రోజంతా ఆశ్రయం ఇచ్చారు. అంతేకాదు, కుటుంబం మొత్తానికి కొత్త బట్టలు పెట్టి గౌరవించారు.

More Telugu News