Jersey: క్రిస్ గేల్ జీవితానికి, జెర్సీ సినిమా కథకు సంబంధం లేదు: గౌతమ్ తిన్ననూరి

  • గేల్ జీవితానికి, జెర్సీ కథకు సంబంధం లేదు
  • ఇది రమణ్ లాంబా కథ అంతకన్నా కాదు
  • ప్రతిభ ఉన్నా మరుగునపడిపోయిన వ్యక్తి కథ ఇది

నాని హీరోగా వచ్చిన జెర్సీ చిత్రం మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో, గౌతమ్ తిన్ననూరి మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచంలో గొప్ప ఆటగాడు అని, కానీ, ఆయనంతటి ప్రతిభ ఉన్నా కొందరు పరిస్థితుల కారణంగా వెలుగులోకి రానివాళ్లు కూడా ఉంటారన్న పాయింట్ ప్రాతిపదికగా జెర్సీ కథ రూపొందించుకున్నానని వెల్లడించారు.

అయితే, వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ కు ఉన్నటువంటి సమస్య జెర్సీ చిత్రంలో నానీకి కూడా ఉండడం యాదృచ్ఛికమేనని తెలిపారు. మీడియా వాళ్లు చెప్పేంతవరకు గేల్ కు ఇలాంటి సమస్య ఉందని తనకు తెలియదని స్పష్టం చేశారు. గేల్ ఒకప్పుడు ఎంతో అరుదైన హృదయ సంబంధ వ్యాధితో బాధపడ్డాడు. అతడి హృదయస్పందన అందరిలా కాకుండా అసాధారణంగా ఉండేది. దానికోసం గేల్ సర్జరీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. అయితే, గేల్ సమస్య గురించి సినిమా రిలీజ్ వరకు తెలియదని గౌతమ్ తిన్ననూరి వెల్లడించారు.

ఇక, భారత దేశవాళీ ఆటగాడు రమణ్ లాంబా లైఫ్ తోనూ జెర్సీ చిత్ర కథను పోల్చలేమని అన్నారు. లాంబా క్రికెట్ ఆడుతూ గాయపడి చనిపోయాడు. సినిమా చూసినవాళ్లకు లాంబా కథతో దీనికి సంబంధం లేదన్న విషయం అర్థమవుతుందని గౌతమ్ పేర్కొన్నారు.

More Telugu News