Chandrababu: ఈ ఎన్నికల్లో నా నియోజకవర్గంలో సుమారు రూ.50 కోట్ల ఖర్చయింది!: జేసీ దివాకర్ రెడ్డి

  • ఎన్నికల్లో విజయం టీడీపీదే
  • పసుపు-కుంకుమ, పెన్షన్ పథకాలే శ్రీరామరక్ష
  • ఏపీలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు

టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశం కోసం ఆయన నేడు అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో మరోసారి టీడీపీనే విజయభేరి మోగిస్తుందని, చంద్రబాబు మళ్లీ సీఎం కావడం తథ్యమని ధీమాగా చెప్పారు. పసుపు-కుంకుమ, పెన్షన్ పథకాలే టీడీపీని కాపాడతాయని తెలిపారు. ఆ రెండు పథకాలు లేకపోతే టీడీపీ పరిస్థితి భగవంతుడికే తెలియాలని అన్నారు.

చంద్రబాబు ఎంత కష్టపడ్డారో ప్రజలకు తెలుసు అని జేసీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు దాదాపుగా 120 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని అన్నారు. అంతేగాకుండా, ఎన్నికల స్థితిగతులపైనా ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

ఈ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో సుమారు రూ.50 కోట్లు ఖర్చయిందని తెలిపారు. ఓటేయండని కోరితే రూ.2000 ఇవ్వాలని ప్రజలే అడుగుతున్నారని జేసీ విస్మయం వ్యక్తం చేశారు. ఇకమీదట ఒక్కో ఓటు రూ.5000 పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. ఎన్నికల్లో ధన ప్రాబల్యం తగ్గించాలన్నది తన అభిమతమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి 10,000 కోట్ల వరకు ఖర్చుచేశాయని అంచనా వేశారు. ఒక్కో అభ్యర్థి రూ.25 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు పెట్టి ఉంటారని వ్యాఖ్యానించారు.

More Telugu News