Hyderabad: శ్రీలంక పేలుళ్ల నేపథ్యంలో.. హైదరాబాద్‌ పోలీసుల హై అలర్ట్‌

  • కొలంబోలో వరుస పేలుళ్ల ఘటనతో రాజధానిలో నిఘా నేత్రం
  • ఉగ్రవాదుల కోసం నగరంలో జల్లెడ  
  • దారి తప్పుతున్న యువతపై దృష్టిపెట్టిన పోలీసులు

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఐసిస్‌ ఈ పేలుళ్లకు పాల్పడిందన్న సమాచారంతో నగర పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. మన దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు ఉగ్రవాదులు ప్లాన్‌ చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో, ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అనుమానితులైన దంపతులను అరెస్టు చేశారు. చాంద్రాయణ గుట్ట ప్రాంతానికి చెందిన అబ్దుల్‌బాసిత్‌ అనే వ్యక్తి ఐసిస్‌లో చేరాలనే లక్ష్యంతో సిరియా, టర్కీ, ఆప్ఘనిస్థాన్‌ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గత ఏడాది పోలీసులకు చిక్కాడు.

ఇతని ప్రయత్నాలకు ఐసిస్‌ సానుభూతి పరులు ఆర్థిక సాయం చేస్తున్నట్లు సమాచారం. దేశంలో ఏ మూలన ఉగ్రచర్యలు జరిగినా దాని మూలాలు ఏదో రూపంలో హైదరాబాద్‌లో వెలుగు చూడడమే పోలీసుల అప్రమత్తతకు కారణం. ఇక్కడ చాప కింద నీరులా ఉగ్రనీడలు విస్తరిస్తున్నాయనే అనుమానాలు బలంగా వినిపిస్తున్న క్రమంలో కుట్రలకు ఆజ్యం పోస్తున్నట్టు భావిస్తున్న పలువురు యువకులను ఎన్ఐఏ విచారిస్తోంది. తాజాగా శ్రీలంక పేలుళ్ల నేపథ్యంలో అధికారులు మరింత అలర్ట్ అయ్యారు.

More Telugu News