Congress: బీజేపీకి అధికారం కలే.. మాకూ మెజారిటీ రాదనుకుంటున్నా: మధ్యప్రదేశ్ సీఎం

  • కేంద్రంలో హంగ్ తథ్యం
  • మిత్రపక్షాలతో కలిసి మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
  • ‘న్యాయ్’ పథకం అమలుకు వనరులున్నాయి

బీజేపీ మరోమారు అధికారం చేపట్టడం కలేనని, అలాగని తమకు కూడా మెజారిటీ వచ్చే అవకాశం లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ అభిప్రాయపడ్డారు. పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన కమల్‌నాథ్.. ఈ ఎన్నికల్లో హంగ్ రావడం తథ్యమన్నారు. అయితే, మిత్ర పక్షాల మద్దతుతో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫలితాల అనంతరం పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. బీజేపీ సహా ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదని, కాంగ్రెస్ గెలుచుకునే సీట్లను బట్టి రాహుల్ గాంధీ ప్రధాని బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.

తన హయాంలో దేశం భద్రంగా ఉందంటూ మోదీ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని, బీజేపీ హయాంలోనే దేశంలో అత్యధిక ఉగ్రదాడులు జరిగాయని కమల్‌నాథ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చిన ‘న్యాయ్’ ఓ విప్లవాత్మక పథకమన్న కమల్‌నాథ్ దాని అమలుకు సరిపడా వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆ పథకం కార్యరూపం దాలిస్తే దేశవ్యాప్తంగా ఐదు కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని కమల్‌నాథ్ పేర్కొన్నారు.

More Telugu News