ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా కలకలం.. మద్యం మత్తులో యువతీయువకుల అసభ్య ప్రవర్తన

22-04-2019 Mon 06:42
  • గ్యాలరీలో పిచ్చి చేష్టలు..అసభ్య ప్రవర్తన
  • నివ్వెరపోయిన ఇతర ప్రేక్షకులు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు భాగ్యనగర వాసులు పోటెత్తారు. వేలాదిమందితో స్టేడియం కిక్కిరిసిపోయింది. ఇదే మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన కొందరు యువతీ యువకులు మద్యం మత్తులో నానా హంగామా చేశారు. అసభ్యంగా ప్రవర్తించి అక్కడి వాతావరణాన్ని కలుషితం చేశారు. వారి ప్రవర్తనను తట్టుకోలేని ఓ  ప్రేక్షకుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు.  

 హైదరాబాద్-కోల్‌కతా మ్యాచ్ చూసేందుకు నగరానికి చెందిన పూర్ణిమ, ప్రియ, ప్రశాంతి, శ్రీకాంత్ రెడ్డి, సురేశ్, వేణుగోపాల్‌లు వచ్చారు. అప్పటికే పూర్తిగా మద్యం మత్తులో ఉన్న వీరి చేష్టలు గ్యాలరీలోని ఇతర ప్రేక్షకులకు వెగటు పుట్టించాయి. పూర్తిగా మైకంలో ఉన్న ఓ యువతి అసభ్యంగా ప్రవర్తించింది. అంతేకాదు, సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో వీరు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో రాత్రి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.