Andhra Pradesh: శత్రువులను కొని తెచ్చుకోవడం ఇష్టం లేదు.. అందుకే తప్పుకున్నాను!: బండ్ల గణేశ్

  • రాహుల్ ను ప్రధానిగా చూడాలన్నది నా కోరిక
  • ఏపీ సీఎంగా పవన్ కల్యాణ్ ని చూడాలన్నది నా ఆశ  
  • నేను రాజకీయాలకు పనికి రాను

రాహుల్ ను ప్రధానిగా చూడాలన్న కోరిక, పవన్ కల్యాణ్ ని ఏపీ సీఎంగా చూడాలన్న ఆశ తనకు ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. ‘టీవీ9’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘ఈ రెండూ జరుగుతాయా?’ అనే ప్రశ్నకు  బండ్ల గణేశ్ సమాధానమిస్తూ, ‘ఎందుకు జరగకూడదు? రూల్ ఏమన్నా ఉందా? పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కాకూడదని భారత రాజ్యంగం ఏమైనా రాసిందా? ఎక్కడ ఏమైనా జరగొచ్చు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధాని కాలేదా? కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి కాలేదా?’ అని ప్రశ్నించారు.

 తాను రాజకీయాలకు పనికిరానని, అందులో ఉన్నప్పటి నుంచి అనవసరంగా తనకు శత్రువులు అవుతున్నారని, శత్రువులను కొని తెచ్చుకోవడం తనకు ఇష్టం లేదని అన్నారు. ఇప్పుడు తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం అంటే తనకు ఇప్పటికీ చాలా ఇష్టమని అన్నారు. ‘నేను పొరపాటున కూడా ఒకరి గురించి  కామెంట్ చేయను. నేను జీవితంలో కొన్ని తప్పులు చేశాను. అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు అనవసరంగా కొన్ని మాట్లాడాను. అదే, ఇప్పుడు మధనపడుతున్నా’ అని అన్నారు. 

More Telugu News