Andhra Pradesh: ఏకంగా ఊరిపైనే విషప్రయోగం చేసిన దుండగులు.. వాచ్ మెన్ అప్రమత్తతతో తప్పిన పెనుముప్పు!

  • తాగునీటి ట్యాంకర్ లో పురుగుల మందు కలిపిన నిందితులు
  • వాసన పసిగట్టిన వాచ్ మెన్ పోలయ్య
  • పోలీసులకు గ్రామ కార్యదర్శి ఫిర్యాదు

ఓ వాచ్ మెన్ అప్రమత్తత గ్రామస్తులను పెను ప్రమాదం నుంచి కాపాడింది. ఊరి వాటర్ ట్యాంకులో పురుగుల మందు వాసన రావడం గమనించిన అతను నీళ్లను వదలకుండా ఆపేశాడు. దీంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో పోలయ్య వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని దుండగులు ఊరికి మంచినీటిని అందించే ట్యాంకులో నిన్న రాత్రి పురుగుల మందును కలిపారు. అయితే అక్కడ పనిచేస్తున్న పోలయ్య ఈరోజు ఉదయాన్నే నీటిని విడుదల చేసేందుకు వచ్చాడు. కానీ కొత్తగా ఏదో వాసన రావడంతో ట్యాంక్ పైకి వెళ్లాడు. అక్కడ నీటిలో పురుగుల మందు వాసన రావడాన్ని గుర్తించాడు.

ఈ విషయాన్ని పోలయ్య గ్రామస్తులకు తెలియజేశాడు. వారు ఇచ్చిన సమాచారంతో గ్రామ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కొవ్వూరు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పోలయ్య అప్రమత్తంగా వ్యవహరించడంపై గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు.

More Telugu News