Chandrababu: ఇక్కడ ఒక్క ఓటు కూడా బీజేపీకి వెళ్లకూడదు: కర్ణాటకలో చంద్రబాబు

  • బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోవాలి
  • అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది
  • తెలుగువాళ్లు ఎక్కడున్నా అండగా ఉంటా

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొప్పల్ జిల్లా శ్రీరామ్ నగర్ లో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోతే తప్ప దక్షిణాది రాష్ట్రాల ప్రజల వెతలు తీరవని అన్నారు. కాషాయదళం ఓటమితోనే అందరికీ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. నదీ జలాల విషయం ఒక జాతీయ సమస్యగా రూపాంతరం చెందిందని అభిప్రాయపడ్డారు. అందుకే బీజేపీకి ఒక్క ఓటు కూడా పోనివ్వకుండా అన్నీ కాంగ్రెస్ అభ్యర్థులకే వేయాలంటూ విజ్ఞప్తి చేశారు.

తెలుగువాళ్లు ఎక్కడున్నా వాళ్ల సంక్షేమం బాధ్యత తాను స్వీకరిస్తానని స్పష్టం చేశారు. తనకున్న పరిచయాల ద్వారా కర్ణాటకలో ఉన్న తెలుగువాళ్లకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి కర్ణాటకలో వ్యవసాయ రంగంలో స్థిరపడి అన్నదాతలుగా నిలిచిన వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాని ప్రసంగం ఆరంభంలో తెలిపారు. తన ప్రసంగాన్ని ఆయన తెలుగులోనే సాగించడం విశేషం.

దక్షిణ భారతదేశంలో ప్రధానంగా నీటిఎద్దడి ఎక్కువగా ఉంటుందని, అందుకే పోలవరం ప్రాజక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని, మరో 30 శాతం పూర్తికావాల్సి ఉందని అన్నారు. జులై నెలలో గ్రావిటీతో నీళ్లు ఇస్తామని చెప్పారు. తాము నదుల అనుసంధానంపై ఎంతో పట్టుదలగా కృషి చేశామని కానీ, నరేంద్ర మోదీ మాట తప్పారని ఆరోపించారు.

More Telugu News