Andhra Pradesh: కర్ణాటక ఎన్నికల్లో ధనప్రవాహం.. కారు టైరులో దాచిన రూ.2 కోట్లు పట్టివేత!

  • తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఘటన
  • పక్కా సమాచారంతో ఐటీ శాఖ అధికారుల దాడి
  • ఈ నెల 23న కర్ణాటకలో రెండో విడత పోలింగ్

కర్ణాటకలో రెండో విడత పోలింగ్ నేపథ్యంలో భారీగా నగదు కట్టలు బయటపడుతున్నాయి. తాజాగా తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓ కారు టైరులో భారీగా నగదును తీసుకెళుతున్నారని రహస్య సమాచారం అందుకున్న అధికారులు ఈ దాడులు నిర్వహించారు. కాగా, తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త కర్ణాటక ఎన్నికలకు ఈ నగదును తరలిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ నెల 23న కర్ణాటకలో రెండో విడత లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లకు పంచడానికే ఈ నగదును తరలిస్తున్నారని భావిస్తున్నారు. ఈ నగదును తరలిస్తున్న కారు డ్రైవర్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నేపథ్యంలో అతనిపై కేసు నమోదుచేశారు. మరోవైపు ఈ నగదును ఎవరి కోసం తరలిస్తున్నారు? ఏ నేతకు అందజేయడానికి తీసుకెళుతున్నారు? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.




More Telugu News