Hyderabad: తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాల బీభత్సం.. ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు!

  • చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ద్రోణి
  • శనివారం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు
  • హైదరాబాద్‌ జూలో కూలిన భారీ వృక్షాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈదురు గాలులు, పిడుగుపాటు వర్షాలకు పలువురు మృత్యువాత పడగా, పంటలకు అపారనష్టం వాటిల్లింది. మూడు రోజల క్రితం ప్రారంభమైన వర్షాలు మరో మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ద్రోణి, ఉత్తర కర్ణాటకలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు పేర్కొన్నారు.

వీటి ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు వీస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించినట్టు వివరించారు. ఈ కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలతోపాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. విశాఖ ఏజెన్సీలోని అనంతగిరిలో వడగళ్ల వాన కురవగా, హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో భారీ వృక్షాలు నేలకూలి సందర్శకులపై పడ్డాయి. గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News