Jammu And Kashmir: ఫోన్ లో డాక్టర్ సూచనలు వింటూ అధికారి ప్రాణాలు కాపాడిన జవాన్

  • కశ్మీర్ లో ఘటన
  • పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారికి గుండెపోటు
  • డాక్టర్ కు ఫోన్ చేసి చికిత్స అందించిన సీఆర్పీఎఫ్ జవాన్

కశ్మీర్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా శ్రీనగర్ లోని బచ్ పొరా పోలింగ్ కేంద్రంలో అసాన్ ఉల్ హక్ అనే ఎన్నికల అధికారి గుండెపోటుకు గురయ్యారు. సమయానికి అక్కడెవరూ వైద్యులు లేకపోవడంతో ఆయన ప్రాణాలకు ప్రమాదం తప్పదని భావించారు. కానీ, ఆ పోలింగ్ కేంద్రంలోనే భద్రత విధులు నిర్వర్తిస్తున్న సురీందర్ కుమార్ అనే సీఆర్పీఎఫ్ జవాను వెంటనే స్పందించాడు. తనకు తెలిసిన డాక్టర్ సునీద్ ఖాన్ కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు.

అయితే, గుండెపోటు సమయంలో ప్రతి నిమిషం విలువైనదే కావడంతో డాక్టర్ సునీద్ ఖాన్ ఫోన్ లోనే చికిత్స వివరాలు తెలిపారు. ఆయన సూచనలను తు.చ తప్పకుండా పాటించిన జవాన్ సురీందర్ కుమార్ ఆ ఎన్నికల అధికారి ప్రాణాలు నిలబెట్టాడు. దాదాపు 50 నిమిషాల పాటు సీపీఆర్ చికిత్స నిర్వహించాడు. నోటి ద్వారా శ్వాస అందిస్తూ ఆయన ప్రాణాలు పోకుండా కాపాడాడు.

ఆపై అంబులెన్స్ రావడంతో అసాన్ ఉల్ హక్ ను ఆసుపత్రికి తరలించారు. సకాలంలో సీపీఆర్ నిర్వహించిన కారణంగానే ఆ అధికారి బతికాడని ఆసుపత్రిలో వైద్యులు తెలిపారు. దాంతో, జవాన్ సురీందర్ కుమార్ ను ప్రతిఒక్కరూ అభినందించారు.

More Telugu News