Rahul Gandhi: రౌల్ విన్సీ అంటే రాహుల్ గాంధీనా? ... ఈ కథేంటో చూడండి!

  • కాంగ్రెస్ చీఫ్ నామినేషన్ పత్రాలపై అభ్యంతరాలు
  • రాహుల్ విద్యార్హతలపై అనుమానాలు
  • స్క్రూటినీ ఏప్రిల్ 22వరకు వాయిదా

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గంతోపాటు కేరళలోని వాయనాడ్ నుంచి కూడా బరిలో దిగుతున్నారు. అయితే, అమేథీలో సమర్పించిన నామినేషన్ పట్ల ఇండిపెండెంట్ అభ్యర్థి ధ్రువ్ లాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ సమర్పించిన నామినేషన్ పట్ల అనేక సందేహాలు ఉన్నాయంటూ ఆయన రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దాంతో, రాహుల్ నామినేషన్ పత్రాల పరిశీలనను ఈనెల 22వరకు వాయిదా వేశారు. కాగా, ధ్రువ్ లాల్ తరఫు న్యాయవాది రవిప్రకాశ్ దీనిపై వివరణ ఇచ్చారు.

ఎన్నికల అఫిడవిట్ లో రాహుల్ గాంధీ విద్యార్హతల విషయంలో తమకు అనుమానం వస్తోందని తెలిపారు. డాక్యుమెంట్లలో ఆయన విద్యార్హతల విషయం సరిపోలడంలేదని చెప్పారు. కాలేజీలో ఆయన పేరు 'రౌల్ విన్సీ' అని ఉందని, రాహుల్ గాంధీ పేరిట ఒక్క సర్టిఫికెట్ కూడా లేదని వివరించారు. అందుకే, రాహుల్ గాంధీ, రౌల్ విన్సీ ఒక్కరేనా అనేది తేల్చుకోవాలనుకుంటున్నామని రవిప్రకాశ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఒరిజినల్ సర్టిఫికెట్ ఇస్తే సందేహనివృత్తి చేసుకుంటామని తెలిపారు.

అంతేకాకుండా, బ్రిటన్ లో రిజిస్టర్ అయిన ఒక కంపెనీ సర్టిఫికెట్ లో రాహుల్ గాంధీ యూకే పౌరుడిగా డిక్లరేషన్ ఇచ్చారని ఆయన వెల్లడించారు. మరి, ఇతర దేశాల్లో పౌరసత్వం ఉన్న వ్యక్తులు భారత్ లో ఎలా ఎన్నికల్లో పోటీచేస్తారంటూ ప్రశ్నించారు. ఈ విషయంలోనూ తాము స్పష్టత కోరుతున్నామని అన్నారు.

More Telugu News