Telangana: హైదరాబాద్ లో ఇంటర్ బోర్డు ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

  • పేపర్లు దిద్దకుండానే మార్కులా?
  • మార్కుల్లో ఏపీ, ఎఫ్ అనే లెటర్లు దేనికి సంకేతం?
  • పీఆర్వో వ్యవహార శైలిపై మండిపాటు

తెలంగాణలో ఇంటర్మీడియట్ మార్కుల విషయంలో అవకతవకలు ఉన్నాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పరీక్ష పేపర్లు సరిగా దిద్దకుండానే ఇష్టం వచ్చినట్టు మార్కులు వేశారని మండిపడ్డారు. అనుభవం లేనివారితో పేపర్లు దిద్దించి ఉంటారని సందేహం వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద పీఆర్వో సరిగా స్పందించడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మార్కుల్లో కొన్నిచోట్ల ఏపీ, ఎఫ్ అనే అక్షరాలు ఉన్నాయని, అవి దేనికి సంకేతాలో వివరించాలని నిలదీశారు. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకుని న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అటు, ఇంటర్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ అవకతవకలతో 21 వేల మంది విద్యార్థుల భవితవ్యం అయోమయంలో పడిందని ఆరోపించారు. కాగా, ఫస్టియర్ లో 98 మార్కులు వచ్చిన విద్యార్థికి సెకండియర్ లో ఫెయిల్ అంటూ మెమో రావడం ఇంటర్ బోర్డు లీలలకు నిదర్శనంగా పేర్కొనాలి.

More Telugu News