Abhinandan Varthaman: నెరవేరనున్న వింగ్ కమాండర్ అభినందన్ కల... త్వరలోనే తిరిగి విధుల్లోకి!

  • పాక్ భూభాగంలో పడినా ధైర్యాన్ని ప్రదర్శించిన అభినందన్
  • నాలుగు వారాల విశ్రాంతి తరువాత వైద్య పరీక్షలకు సిద్ధం
  • తిరిగి పైలట్ దుస్తులు ధరించే అవకాశాలు పుష్కలమంటున్న అధికారులు

పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చి, ఆపై పాక్ జరిపిన దాడిలో తాను నడుపుతున్న విమానం దెబ్బతినగా, సరిహద్దులకు ఆవల పడినా, అత్యంత ధైర్య సాహసాలతో వ్యవహరించి, తిరిగి ఇండియాకు చేరిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్, తిరిగి భారత వాయుసేనలో చేరి భరతమాతకు సేవలందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైద్యులు సూచించిన విధంగా నాలుగు వారాలు విశ్రాంతి తీసుకున్న వర్ధమాన్, బెంగళూరులోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

పూర్తి స్థాయి వైద్య పరీక్షలను చేయించుకోవడానికి రెడీగా ఉన్నారని, తిరిగి విధుల్లో చేరాలన్న వర్ధమాన్ పట్టుదల చూస్తుంటే, త్వరలోనే తిరిగి పైలట్ దుస్తులు ధరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఏదైనా ప్రమాదంలో పైలట్లు గాయపడితే, 12 వారాల పాటు నిపుణుల పర్యవేక్షణలో ఉండాలి. వర్ధమాన్ కు ఈ గడవు మే నెలాఖరుతో ముగుస్తుంది. ఇప్పటికే ఆయన పూర్తి ఆరోగ్య స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News