రోడ్డున పడ్డ 500 మంది జెట్ ఉద్యోగులకు స్పైస్ జెట్ ఆసరా!

20-04-2019 Sat 11:27
  • 100 మందికి పైగా పైలట్లను తీసుకున్నాం
  • మరో 400 మంది ఇతర స్టాఫ్ ను కూడా
  • వెల్లడించిన స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్
  • మరిన్ని ఉద్యోగాలు ఇస్తామని వెల్లడి

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, తాత్కాలికంగా మూతబడ్డ జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 500 మందికి ఉద్యోగాలను కల్పించామని, తమ తదుపరి నియామకాల్లో సైతం జెట్ బాధితులను అత్యధికంగా తీసుకుంటామని స్పైస్ జెట్ ప్రకటించింది. ఇప్పటికే 100 మంది కన్నా అధిక పైలట్లు, 200 మందికి పైగా క్యాబిన్, 200 మందికి పైగా టెక్నికల్ తదితర ఉద్యోగాలను కల్పించామని స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ వెల్లడించారు. జెట్ విమానాలు ఆగిపోయిన నేపథ్యంలో, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఖాళీ స్లాట్లను భర్తీ చేసేందుకు వచ్చే 15 రోజుల వ్యవధిలో 27 అదనపు సర్వీసులను చేర్చామని ఆయన తెలిపారు.

ఇదిలావుండగా, జెట్ నిర్వహించిన స్లాట్ల క్రమబద్దీకరణకు ఓ కమిటీని వేసే దిశగా కేంద్ర విమానయాన శాఖ యోచిస్తోంది. జెట్ చేతుల్లో 440 స్లాట్లు ఉండగా, వాటిని ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ కంపెనీలకు ఇవ్వాలని భావిస్తోంది. ఇదిలావుండగా, జెట్ వాటాలను విక్రయించడం ద్వారా సంస్థను కాపాడాలని చూస్తున్న ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం బిడ్డింగ్ లను ఆహ్వానించినా, ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని జెట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.